Telangana: కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీలకంగా వ్యవహరించాలి: సీఎం కేసీఆర్

  • జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో  కేసీఆర్ సమావేశం
  • ఏకపక్షంగా విజయం సాధించిన వారికి అభినందన
  • రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారాలి

హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లోని జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఏకపక్షంగా విజయం సాధించిన వారిని అభినందించారు. ఐదేళ్లు పని చేసి బాగా పేరు తెచ్చుకోవాలని వారికి కేసీఆర్ సూచించారు. పదవి వచ్చిన తర్వాత సహజత్వాన్ని కోల్పోవద్దని, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు.

రానున్న రోజుల్లో గ్రామీణ, పట్టణాభివృద్ధికి ఎలా పాటుపడాలనే అంశంపై వారికి సీఎం దిశా నిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రామాభివృద్ధికి పంచాయతీరాజ్ ఉద్యమం, సహకార ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. గ్రామ వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు నిధులు అందిస్తామని, సీఎం ప్రత్యేక ప్రగతి నిధి నుంచి రూ.10 కోట్లు అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారాలని సూచించారు.

కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులకు త్వరలో శిక్షణ తరగతులు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలులో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ చట్టంపై అవగాహన పెంచుకోవాలని, మన వ్యవహార శైలే, మనకు మేలు చేస్తుందని చెప్పారు. ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ లు ఎప్పుడూ గెలుచుకోలేదని, ఆరు నెలల్లో పూర్తి మార్పు కనిపించాలని సూచించారు. ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్ కు కొత్త కారు కొనిస్తామని కేసీఆర్ వెల్లడించారు. 

  • Loading...

More Telugu News