RBI: ఆన్ లైన్ లావాదేవీల ఛార్జీల ఎత్తివేతపై ఆర్బీఐ ఆదేశాలు!

  • ఖాతాదారులకు శుభవార్త చెప్పిన రిజర్వు బ్యాంకు
  • ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై రుసుము ఎత్తివేత
  • జూలై 1 నుంచే అమల్లోకి

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టం‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా జరిపే ఆన్‌లైన్ నగదు లావాదేవీలపై ఫీజులు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. భారీ మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఉపయోగించే ఈ రెండు విధానాల్లోనూ వచ్చే నెల 1 నుంచి ఉచితంగా లావాదేవీలు జరుపుకోవచ్చని పేర్కొంది. భారతీయ స్టేట్ బ్యాంకు నెఫ్ట్ లావాదేవీలకు రూ.5 వరకు వసూలు చేస్తుండగా, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు గరిష్టంగా రూ.50 వరకు వసూలు చేస్తోంది.

నిజానికి ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలకు ఆర్‌బీఐ ఇప్పటి వరకు కనీస రుసుము వసూలు చేస్తోంది. దీంతో ఆ భారాన్ని బ్యాంకులు తమపై వేసుకోకుండా ఖాతాదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు వీటిని రిజర్వు బ్యాంకు ఎత్తివేడయంతో ఖాతాదారులపై భారం తగ్గనుంది.

జూలై 1 నుంచి ఖాతాదారుల నుంచి ఈ రుసుములు వసూలు చేయవద్దని అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, నగదు చలామణి తగ్గించడం, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత వంటి వాటి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వు బ్యాంకు తెలిపింది.  

  • Loading...

More Telugu News