Perni Nani: అధికారులు రాజకీయాలు పక్కన పెట్టాలి: కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశంలో మంత్రి పేర్ని నాని
- అభివృద్ధి కోసం కలసి పని చేయండి
- కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశం రసాభాస
- సర్దిచెప్పిన పేర్ని నాని
అధికారులు అందరూ రాజకీయాలు పక్కన పెట్టాలని, రాష్ట్రాభివృద్ధికి కలసి పనిచేయాలని రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని నాని సుతిమెత్తగా హెచ్చరించారు. అధికారులకు తాను నమస్కరిస్తున్నానని, పజల అన్ని రకాల అవసరాలనూ తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశం మచిలీపట్నంలో జరుగగా, జెడ్పీ చైర్మన్ గద్దె అనూరాధ అధ్యక్షతన సమావేశం జరుగగా, వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్నవేళ పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. సభ్యులకు సర్దిచెబుతూ, అందరూ కలిసి పని చేయాలని అన్నారు.
ఆపై సభలో ఎమ్మెల్సీ కేఎస్ లక్షణరావు మాట్లాడుతూ, కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, గతంలో తీసుకున్న రుణాలను వారు చెల్లించక పోవడంతోనే మరోసారి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని అన్నారు. బ్యాంకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. భూమిని సాగు చేసుకోనివ్వకుండా తిరువూరు నియోజకవర్గంలో గిరిజనులను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆరోపించగా, తెలుగుదేశం సభ్యులు అడ్డుకోవడంతో మరోసారి వివాదం చెలరేగింది. అధికారులు టీడీపీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయ్యారని ఆయన అనడంతో, ఇకపై ఆ పరిస్థితి ఉండదని పేర్ని నాని సర్ది చెప్పారు. ఈ అంశంపై కలెక్టర్, జేసీ దృష్టిని సారిస్తారని భరోసాను ఇచ్చారు.