Andhra Pradesh: టీడీపీ అవినీతిపై విచారణ జరిపిస్తాం.. తిన్న ప్రజల సొమ్మును బయటకు తీస్తాం!: జోగి రమేశ్ హెచ్చరిక

  • టీడీపీ ప్రభుత్వ ప్రాజెక్టులను అడ్డుకోబోం
  • వాళ్ల అవినీతికి వ్యతిరేకంగానే ప్రజలు మమ్మల్ని గెలిపించారు
  • అసెంబ్లీ దగ్గర మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే

తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రారంభించిన ఏ ప్రాజెక్టును కూడా అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతీ ప్రాజెక్టులోనూ భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే తమకు అధికారాన్ని అప్పగించారని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సచివాలయానికి చేరుకున్న జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్ నాయకత్వానికి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న రీతిలో టీడీపీ నేతల వ్యవహారశైలి ఉందని చెప్పారు. టీడీపీ అవినీతిపై తాము విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ది చాలా నిర్మలమైన మనసు అనీ, అందుకే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం లేదని చెప్పారు.

టీడీపీ నేతలు దోచుకున్న వేలకోట్ల ప్రజల సొమ్మును బయటకు తీస్తామని హెచ్చరించారు. వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం అప్రతిహతంగా కొనసాగుతుందని అన్నారు. కోడెలపై తమకు ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. ప్రజలను కోడెల హింసించారు కాబట్టే ఆయన బాగోతాన్ని ప్రజలు బయటపెడుతున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News