Kodela: కోడెల కుమారుడిపై మరో కేసు... రూ. 2.30 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదు!
- శివరామ్ బెదిరించారు
- డబ్బు ఇవ్వకుంటే వ్యాపారం సాగనివ్వలేదు
- డీఎస్పీని ఆశ్రయించిన వంశీకృష్ణ
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబ సభ్యులపై కేసులు ఆగడం లేదు. అధికారంలో ఉన్న వేళ, ఆయన కుమార్తె విజయలక్ష్మి తమను మోసం చేశారని, బెదిరించి డబ్బులు గుంజారని ఇప్పటికే పోలీసులకు పలు ఫిర్యాదులు అందగా, కోడెల కుమారుడు శివరామ్ పై మరో ఫిర్యాదు పోలీసులకు అందింది.
నరసరావుపేటలో నిర్మాణ రంగంలో వ్యాపారిగా ఉన్న వంశీకృష్ణ అనే వ్యక్తి, శివరామ్ తనను బెదిరించి రూ. 2.30 కోట్లు వసూలు చేశారని పోలీసులను ఆశ్రయించారు. తాను కోటప్పకొండ వద్ద 'గ్రీన్ ట్రీ వెంచర్స్' పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించానని, 115 ఎకరాల భూమి బదలాయింపునకు తన వద్ద రూ. 2.30 కోట్లు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. డబ్బు ఇచ్చేందుకు తాను నిరాకరిస్తే, పర్మిషన్ రాకుండా కోడెల ఫ్యామిలీ అడ్డుకుందని ఆపై తాను డబ్బు ఇచ్చానని ఆధారాలతో సహా నరసరావుపేట డీఎస్పీని వంశీకృష్ణ ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదైంది.