Andhra Pradesh: వైసీపీ నేతలను చంద్రబాబు పర్సనల్ గా టార్గెట్ చేశారు.. మేం అలా ప్రవర్తించబోం!: నగరి ఎమ్మెల్యే రోజా
- రెండోసారి ఎమ్మెల్యే కావడం సంతోషంగా ఉంది
- చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేలు మిగలడం దేవుడి స్క్రిప్ట్
- దేశానికే ఆదర్శంగా ఏపీ అసెంబ్లీని నడిపిస్తాం
ఏపీ అసెంబ్లీకి రెండోసారి ఎన్నికై రావడం చాలా ఆనందంగా ఉందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు సభాసంప్రదాయాలను తుంగలో తొక్కారనీ, ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వలేదని విమర్శించారు. చాలామంది వైసీపీ నేతలను చంద్రబాబు పర్సనల్ గా టార్గెట్ చేశారనీ, దీన్ని ప్రజలంతా చూశారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడారు.
23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబుకు ఈరోజు 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారని రోజా ఎద్దేవా చేశారు. నిజంగా భగవంతుడు రాసిన స్క్రిప్ట్ కు అందరూ సెల్యూట్ కొట్టాలని వ్యాఖ్యానించారు. తనను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది సస్పెండ్ చేశారనీ, కానీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడామని చెప్పారు.ఏపీ అసెంబ్లీలో తాము టీడీపీ ఎమ్మెల్యేలలాగా ప్రవర్తించబోమని స్పష్టం చేశారు.
ఏపీ అసెంబ్లీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా నిర్వహిస్తామని రోజా అన్నారు. గత ప్రభుత్వంలాగా మహిళలను లక్ష్యంగా చేసుకుని సస్పెండ్ చేయడాలు, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాలు ఉండబోవని తేల్చిచెప్పారు. నవరత్నాలను ప్రజలకు అందించడానికి సీఎం జగన్ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. పచ్చచానళ్లు జగన్ పై అవినీతి చేశారంటూ బురద చల్లాయని విమర్శించారు.