Andhra Pradesh: పదవికి రాజీనామా చేసిన ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి
- చంద్రబాబు హయాంలో చైర్మన్ గా నియమితుడైన సుబ్బారెడ్డి
- 9 నెలల పదవీకాలం అనంతరం మారిన ప్రభుత్వం
- రాజీనామా లేఖ సంస్థ ఎండీకి అందజేత
ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి, తన పదవికి రాజీనామా చేస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖను రాశారు. రాష్ట్రంలో అధికారం మారిన నేపథ్యంలో తాను పదవిని వీడుతున్నట్టు తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ను ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను విజయవాడలోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఎండీకి ఏవీ సుబ్బారెడ్డి అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు చంద్రబాబు 9 నెలల క్రితం ఈ పదవిని అప్పగించారని, ఇంతకాలమూ సమర్థవంతంగా తన విధులను నిర్వహించానని అన్నారు. తక్కువ కాలంలోనే తాను అన్ని జిల్లాల్లోనూ పర్యటించి, రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. నాణ్యమైన విత్తనాలు రైతాంగానికి అందించేందుకు తాను కృషి చేశానని తెలిపారు. పదవి ఉన్నా, లేకున్నా తనను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తానని తెలిపారు.