Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే రాపాక ప్రత్యేక భేటీ!
- సీఎం ఛాంబర్ లోకి వెళ్లి సమావేశమయిన నేత
- రాజకీయాలు మాట్లాడలేదని వ్యాఖ్య
- గతంలో వైసీపీలో చేరుతారని ఊహాగానాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం రాపాక వరప్రసాద్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం ఛాంబర్ లోకి వెళ్లి పలు అంశాలపై చర్చించారు.
అనంతరం బయటకి వచ్చిన వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ..‘ ముఖ్యమంత్రితో నేను మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యాను. రాజకీయ విషయాలేవీ చర్చించలేదు. రాజోలు నియోజక వర్గం అభివృద్ధిపై సీఎంతో మాట్లాడాను’ అని స్పష్టం చేశారు. గతంలో వరప్రసాద్ వైసీపీలో చేరతారని వార్తలు రాగా, వాటిని ఆయన కొట్టిపారేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు.