Chandrababu: చంద్రబాబు శాశ్వతంగా ప్రతిపక్షనాయకుడిగా ఉండిపోవచ్చు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- చంద్రబాబు మామూలుగానే ఓ గజిని
- అధికారం కోల్పోయాక ఆయనకేమీ అర్థం కావట్లేదు
- ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మామూలుగానే ఓ గజినీ అని, అధికారం కోల్పోయాక ఆయనకేమీ అర్థం కాక ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను తాము ఆపేస్తున్నామని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని ప్రాజెక్టులన్నింటినీ తన హయాంలో కొనసాగించానని, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి అభివృద్ధి ఆగిపోతే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు.
ప్రాజెక్టులను ఆపేస్తున్నామని ఎవరు చెప్పారు? మేము కొనసాగించట్లేదని ఎవరైనా చెప్పారా? అని అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. పారదర్శక విధానాన్ని, టెండర్లలో జ్యుడిషియల్ సిస్టమ్ ను తీసుకొస్తున్నామని, తద్వారా అవినీతిని అరికట్టే అవకాశముంటుందని తమ నాయకుడు జగన్ స్పష్టంగా చెప్పారని అన్నారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణుల కమిటీ వేస్తామని, ప్రజాధనం వృథా కాకుండా చూడాలన్నది సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు, టెండర్లలో ఎటువంటి అవినీతీ జరగకపోతే భయపడాల్సిన అవసరమేంటని చంద్రబాబును ప్రశ్నించారు.
ఎక్కడ తన అవినీతి, దోపిడీ బయటకొస్తుందోనని చంద్రబాబు భయపడి, లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు వైఎస్ హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమాన్ని ఈ ఐదేళ్లలో జగన్ పూర్తి చేస్తారని, లక్షలాది ఎకరాలకు నీరందిస్తారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతికి సంబంధించి చాలా అవినీతి జరిగిందని పేపర్లు, మీడియాలో వచ్చిందని, దీనిపై ఓ కమిటీ వేస్తున్నామని, నలభై ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని అన్నారు.
నిజంగా, చంద్రబాబు మంచి చేసుంటే ‘క్లీన్’గా బయటపడతారని, ఒకవేళ తప్పు చేసుంటే కనుక దోపిడీ బయటపడుతుందని వ్యాఖ్యానించారు. ఇంకా ఇది జెస్ట్ స్టార్టింగే.. జగన్మోహన్ రెడ్డి పని తీరు ప్రారంభమై పదిరోజులే అయిందనీ, దీనికే, చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినట్టుందని అన్నారు. ఇక, శాశ్వతంగా ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉండిపోవచ్చని వ్యాఖ్యానించారు.