Roja: తన తప్పును చంద్రబాబు ఒప్పుకుంటే, జగన్ మాట్లాడతారు: రోజా కీలక వ్యాఖ్యలు
- చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకోవాలి
- అప్పుడు జగన్ రుణమాఫీపై మాట్లాడతారు
- టీడీపీ నేతలపై ప్రతీకార చర్యలు ఉండబోవన్న రోజా
ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తన తప్పుడు అబద్ధపు హామీలతో మోసం చేశానని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అంగీకరిస్తే, రుణమాఫీ అంశంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తారని నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ అంశం గత ప్రభుత్వపు తప్పుడు హామీయేనని వ్యాఖ్యానించిన ఆమె, చంద్రబాబు అసెంబ్లీలో లెంపలేసుకుని రైతులకు క్షమాపణ చెప్పే సమయం వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, ఆయన తాను ఇంకా సీఎంను అనుకుంటున్నారని, ఇప్పుడాయన ప్రతిపక్ష నేత మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఓ ప్రతిపక్ష నేతకు ఎంత భద్రత ఉంటుందో, చంద్రబాబుకు కూడా అంతే భద్రత ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు.
నాడు తనను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయమై, ఇప్పుడు ఎటువంటి ప్రతీకార చర్యలూ ఉండబోవని తెలిపారు. కాగా, రైతులకు మిగిలిపోయిన రుణమాఫీని ఎప్పుడు అందిస్తారో తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.