West Bengal: మరింత ఉద్ధృతమైన కోల్‌కతా వైద్యుల ఆందోళన.. దేశవ్యాప్తంగా సంఘీభావం!
- వైద్యుడిపై దాడి చేసిన రోగి బంధువులు
- రక్షణ కల్పించాలంటూ వైద్యుల ఆందోళన
- సంఘీభావంగా ముందుకొస్తున్న వివిధ నగరాల వైద్యులు
కోల్‌కతా వైద్యుల ఆందోళన శుక్రవారం నాలుగో రోజు మరింత ఉద్ధృతమైంది. నగర వైద్యులకు ఢిల్లీలోని ఎయిమ్స్ సహా పాట్నా, రాయ్‌పూర్, రాజస్థాన్, పంజాబ్ వైద్యులు సంఘీభావం ప్రకటించారు. ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు కూడా సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు.
ఈ ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు కూడా ఆందోళనల్లో పాలుపంచుకోవడంతో ముఖ్యమైన వైద్య సేవలు నిలిచిపోయాయి. కోల్‌కతాలోని తమ సహచరులకు మద్దతుగా సేవలు నిలిపివేస్తున్నట్టు ఢిల్లీలో పలు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. కాగా, వైద్య సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ బంధువు మరణించాడంటూ సోమవారం రాత్రి కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో రోగి బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేసి చితక్కొట్టారు. దాదాపు 200 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు ప్రస్తుతం కోలుకుంటున్నారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ వైద్యులు తమ సేవలను నిలిపివేశారు. రోజురోజుకు మరింత ఉద్ధృతంగా మారుతున్న ఆందోళన నేడు దేశంలోని మిగతా ప్రాంతాలకు పాకింది.