Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి!
- తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
- కానీ ఏపీలో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు
- జగన్ ప్రభుత్వ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది
ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించే నేతలపై కొరడా ఝుళిపిస్తామని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా నేత తమ పార్టీలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా దాన్ని పాటించకుంటే సదరు సభ్యుడిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను కోరారు.
తాజాగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, నటి విజయశాంతి ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయ్యాక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే వింతగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
దేశానికే ఆదర్శంగా ఉంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విజయశాంతి విమర్శించారు. స్పీకర్ ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో హైకోర్టు నుంచి నోటీసులు కూడా వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పీకర్ ను ఎన్నుకుని ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టిన వెంటనే అధికార పక్షం చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని వ్యాఖ్యానించారు.
ఫిరాయింపుదారులను పార్టీలోకి తీసుకోబోమనీ, అన్ని పదవులకు రాజీనామా చేశాకే వారు వైసీపీలోకి రావాలని జగన్ తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలకు చెంపపెట్టు అని అన్నారు. ఏపీలోని పరిణామాలపై సీఎం కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారో అని తెలంగాణ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.