Vayu: 'వాయు' తుపాను మళ్లీ దిశ మార్చుకుని గుజరాత్ కచ్ తీరాన్ని తాకే అవకాశం!
- మొదట పోరుబందర్ వద్ద తీరాన్ని తాకుతుందని అంచనా
- దిశ మార్చుకుని సముద్రంలోకి వెళ్లిపోయిన 'వాయు'
- ఈ నెల 16న మరోసారి దిశ మార్చుకుంటుందన్న కేంద్ర వర్గాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను మొదట గుజరాత్ లోని పోరుబందర్ తీరాన్ని తాకుతుందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేసినా, ఆపై అది దిశ మార్చుకుని అరేబియా సముద్రంలోకి వెళ్లింది. అయితే, వాయు తుపాను మళ్లీ దిశ మార్చుకుని ఈసారి గుజరాత్ లోని కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ తెలిపారు. ఈ నెల 16న మరోసారి దిశ మార్చుకుని కచ్ తీరం వైపుగా పయనిస్తుందని, 17, 18 తేదీల్లో తీరం దాటుతుందని వివరించారు. బహుశా అత్యధిక సమయం సముద్రంలోనే ఉండడం వల్ల వాయు తుపాను బలహీనపడి వాయుగుండంగా తీరం దాటుతుందని రాజీవన్ అభిప్రాయపడ్డారు. వాయు మళ్లీ దిశ మార్చుకోవడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు.