New Delhi: 24 గంటల్లో ఐదు హత్యలు జరిగాయన్న కేజ్రీవాల్.. వాస్తవం ఇదంటూ పోలీసుల ఘాటు రిప్లై!
- హోంమంత్రిత్వ శాఖ, లెఫ్టినెంట్ గవర్నర్‌లను ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్
- అవి వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలన్న పోలీసులు
- నేరాల సంఖ్య ఢిల్లీలో గణనీయంగా తగ్గిందంటూ ట్వీట్
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 24 గంటల్లోనే ఢిల్లీలో ఐదు హత్యలు జరిగాయని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, హోమంత్రిత్వ శాఖ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ట్వీట్ చేశారు.
సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌పై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇవి వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలని, నిందితులు-బాధితులు ఒకరికొకరు తెలుసని ట్వీట్ చేశారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గతేడాదితో పోలిస్తే 10.5 శాతం తగ్గిందని పేర్కొన్నారు. మారణాయుధాలతో జరిగే హత్యల రేటు 5.65 శాతం, మహిళలపై నేరాల సంఖ్య 11.5 శాతం తగ్గిందని పోలీసులు తమ ట్వీట్‌లో వివరించారు.