Gujarat: ఫేక్ వీడియోను పోస్టు చేసిన గుజరాత్ ఎమ్మెల్యే.. ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు
- అర్ధ నగ్నంగా ఉన్న విద్యార్థిపై టీచర్ ప్రతాపం
- స్కూలును మూసివేసే వరకు వీడియోను షేర్ చేయాలంటూ మేవాని పోస్ట్
- అది ఈజిప్టుదని తెలియడంతో వీడియో డిలీట్
ఓ స్కూలుకు సంబంధించి ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి స్కూలు ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానిపై కేసు నమోదైంది. అర్ధ నగ్నంగా ఉన్న ఓ విద్యార్థిని ఓ వ్యక్తి కొడుతున్నట్టు ఉన్న వీడియోను గత నెల 20న తన ట్విట్టర్ ఖాతాలో మేవాని పోస్టు చేశారు. పిల్లాడిని చావబాదుతున్న ఆ టీచర్ వల్సాద్కు చెందిన ఆర్ఎంవీఎం స్కూలుకు చెందిన వారని మేవాని పేర్కొన్నారు.
ఈ వీడియోపై స్పందించిన ఆర్ఎంవీఎం స్కూలు ప్రిన్సిపాల్ విజల్ కుమారి పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ వీడియో తమ స్కూలుది కాదని, పాఠశాల పేరును, ఉపాధ్యాయులను అప్రతిష్ఠ పాలు చేసేందుకు జరుగుతున్న కుట్ర అని పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఎమ్మెల్యే మేవానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయుడిని టీచర్ కొడుతున్న వీడియోను షేర్ చేసిన మేవాని ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఆర్ఎంవీఎం స్కూలును మూసివేసే వరకు ఈ వీడియోను వీలైనంతమందికి షేర్ చేయాలని ఎమ్మెల్యే కోరారు. అయితే, ఆ వీడియో గుజరాత్‌కు చెందినది కాదని, ఈజిప్టులోని ఓ స్కూలుకు చెందినదని తెలియడంతో ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వీడియోను తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు.