Andhra Pradesh: టీడీపీ నేత నారా లోకేశ్ పై మండిపడ్డ ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్!
- టీడీపీ మద్దతుదారుల ఇళ్లు కూల్చేస్తున్నారన్న లోకేశ్
- గతంలో టీడీపీ ప్రభుత్వం 120 ఇళ్లు కూల్చిందన్న మంత్రి
- వారికి ఇంకా న్యాయం చేయలేదని ఆగ్రహం
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనీ, నెల్లూరులో నిరుపేదలైన టీడీపీ మద్దతుదారుల గుడిసెలు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా లోకేశ్ వ్యాఖ్యలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు.
2017, డిసెంబర్ నెలలో టీడీపీ ప్రభుత్వం నెల్లూరులో 120 ఇళ్లను కూల్చివేసిందనీ, 151 కుటుంబాలను రోడ్డున పడేశారని అనిల్ ఆరోపించారు. వాళ్లకు పునరావాసం కానీ, నష్టపరిహారం కానీ ఇంతవరకూ అందించలేదని దుయ్యబట్టారు. అలాంటి నిరుపేదలకు వైసీపీ అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఏదైనా వార్తాపత్రికల ఆర్టికల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేముందు క్షుణ్ణంగా చదవాలని హితవు పలికారు. ఈ ట్వీట్ కు నారా లోకేశ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా మంత్రి అనిల్ ట్యాగ్ చేశారు.