Cricket: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ... భారీస్కోరు దిశగా టీమిండియా
- అర్థసెంచరీ సాధించిన రాహుల్
- తొలి వికెట్ కు 136 పరుగులు జోడింపు
- టాస్ గెలిచిన టీమిండియాకు బ్యాటింగ్ ఇచ్చిన పాక్
దాయాదుల పోరులో టీమిండియా దంచికొడుతోంది. పాకిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 85 బంతుల్లోనే రోహిత్ శతకం సాధించడం విశేషం. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ. టాస్ గెలిచిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ కు దిగింది. టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 136 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ అవుటయ్యాడు. రాహుల్ 57 పరుగులు నమోదు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా రోహిత్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం రోహిత్ 106 పరుగులతో, కోహ్లీ 22 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా స్కోరు 33 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 191పరుగులు.