Andhra Pradesh: చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరుతో రూ.500 కోట్లు నాకేశారు!: మంత్రి అనిల్ కుమార్
- నీరు-చెట్టు కోసం రూ.18,000 కోట్లు ఖర్చు పెట్టారు
- పోలవరం అంచనాలను రూ.56 వేలకోట్లకు తీసుకెళ్లారు
- అసెంబ్లీలో టీడీపీ నేతలపై మండిపడ్డ ఏపీ మంత్రి
నీటి బొట్టు లేకుండా, చిన్న మొక్క లేకుండానే నీరు-చెట్టు పథకం కింద టీడీపీ నేతలు రూ.18,000 కోట్లు దోచేశారని ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.16 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.56,000 కోట్లకు తీసుకెళ్లిన ఘనచరిత్ర కూడా టీడీపీ నేతలదే అని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి అనిల్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. ధర్మపోరాట దీక్షల పేరుతో చంద్రబాబు రూ.500 కోట్లను నాకేశారని ఆరోపించారు.
అందుకే ఏపీ ప్రజలు ఆ మూలన టీడీపీ నేతలను కూర్చోబెట్టారని చమత్కరించారు. అలీబాబా 40 దొంగల తరహాలో ఈ అలీబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనీ, దీంతో ఆ భగవంతుడు చివరికి టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా సాగిందన్న విషయమై స్పందిస్తూ.. ‘పోలవరంలో నిర్మాణ చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోలర్ ఆయనే. దొంగ ఆయనే. పోలీసూ ఆయనే.. పగలు ప్రాజెక్టు కడతాడంట. మధ్యాహ్నం నుంచి క్వాలిటీ చెక్ చేస్తాడంట’ అని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును 3 నెలల్లో, 4 నెలల్లో పూర్తిచేయాలని అచ్చెన్నాయుడు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.