Shoaib Akhtar: మాకొక బుద్ధిమాలిన కెప్టెన్ ఉన్నాడు: టీమిండియా చేతిలో పాక్ ఓటమిపై షోయబ్ అక్తర్ ఫైర్
- ఎప్పుడూ మతిలేని పనులే చేస్తుంటాడు
- ఇమ్రాన్ ఖాన్ తరహాలో తెలివిగా వ్యవహరిస్తాడనుకున్నాం
- పాక్ జట్టు ఛేజింగ్ లో బలహీనం అని తెలియదా?
భారత్ ను ప్రబల విరోధిగా చూసే పాకిస్థాన్ క్రికెటర్లలో షోయబ్ అక్తర్ ఒకడు. రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరుగాంచిన అక్తర్ తన కెరీర్ ఆసాంతం భారత ఆటగాళ్లను తన పదునైన పేస్ తో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించేవాడు. కొన్నిసార్లు సక్సెస్ అయినా, ఆ తర్వాత కాలంలో టీమిండియా ఆటగాళ్లు అతడిని ఓ సాధారణ బౌలర్ కింద మార్చేశారు. ఈ నేపథ్యంలో, తాజాగా పాకిస్థాన్ జట్టు టీమిండియా చేతిలో దారుణంగా పరాజయం పాలవడం పట్ల అక్తర్ రగిలిపోతున్నాడు. ఆ కోపాన్నంతా తమ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పై వెళ్లగక్కాడు.
ఇంత బుద్ధివిహీనుడైన కెప్టెన్ ను ఎక్కడా చూడలేదంటూ విమర్శించాడు. "ఇంత తెలివితక్కువ పనిచేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటాడనుకుంటే మతిలేని పని చేశాడు. వరల్డ్ కప్ మ్యాచ్ లో పాక్ టాస్ గెలవగానే సగం మ్యాచ్ చేతిలోకి వచ్చేసిందనుకున్నాం కానీ సర్ఫరాజ్ చేజేతులా మ్యాచ్ ను ప్రత్యర్థికి అప్పగించేశాడు. పాక్ ఛేజింగ్ చేయలేదన్న విషయం తెలిసి కూడా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాడో అతనికే తెలియాలి. ఇమ్రాన్ ఖాన్ తరహాలో తెలివైన ఎత్తుగడలు వేస్తాడనుకుంటే బుద్ధిమాలిన పనులతో చెడ్డపేరు తీసుకువస్తున్నాడు" అంటూ అక్తర్ మండిపడ్డాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో కూడా పాక్ ఇదేతీరులో వెస్టిండీస్ చేతిలో ఓడిపోగానే, అక్తర్ తన విమర్శనాస్త్రాలు సర్ఫరాజ్ పైనే ఎక్కుపెట్టాడు. సర్ఫరాజ్ కు బాగా కొవ్వెక్కువైంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.