Sujana Chowdary: నారా లోకేశ్ మంగళగిరిలో పోటీ చేయడమే పెద్ద తప్పు: సుజనా చౌదరి
- మంగళగిరి బీసీ ప్రాబల్య ప్రాంతం
- సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఎంతో కష్టపడి పనిచేశారు
- చంద్రబాబు నాయకత్వంపై ఎవరికీ అనుమానాల్లేవు
ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ అగ్రనేత సుజనాచౌదరి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ టీడీపీ భవిష్యత్ నాయకత్వంపై స్పందించారు. ఇప్పట్లో చంద్రబాబు నాయకత్వంపై ఎవరికీ అనుమానాల్లేవని, ఆయన ఎంతో క్రమశిక్షణతో ఉండే వ్యక్తి అని తెలిపారు. చాలాకాలం పాటు చంద్రబాబే టీడీపీకి అధినేతగా ఉంటారని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ యువనాయకత్వంపై ప్రస్తావన రావడంతో సుజనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకుపోవాలని సూచించారు. మంగళగిరిలో ఎన్నో ఏళ్లుగా పసుపు జెండా ఎగరలేదని, ఆ పని తాను చేస్తానని లోకేశ్ బరిలో దిగడం పెద్ద తప్పు అని సుజనా నిర్మొహమాటంగా చెప్పారు. మంగళగిరి బీసీల ఆధిపత్యం ఉన్న ప్రాంతం కావడం లోకేశ్ కు వ్యతిరేకంగా పరిణమించిందని, దానికితోడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేకి ఉన్న పట్టు కూడా లోకేశ్ ఓటమి కారణంగా చెప్పుకోవచ్చని వివరించారు. ఈ ఐదేళ్లలో ఆర్కే ఎంతో కష్టపడి పనులు చేయడమే కాకుండా నిత్యం ప్రజల్లో ఉన్నాడని తెలిపారు.