Afridi: మ్యాచ్ పూర్తికాకముందే టీమిండియాకు శుభాకాంక్షలు చెప్పిన అఫ్రిదీ!
- మ్యాచ్ సగంలో ఉండగానే అఫ్రిది ట్వీట్
- ఈ గొప్పదనం బీసీసీఐదేనన్న పాక్ మాజీ క్రికెటర్
- ఐపీఎల్ తో కుర్రాళ్లు రాటుదేలారంటూ వ్యాఖ్య
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల మధ్య యుద్ధంతో సమానం! ఇందులో ఇలాంటి అతిశయోక్తి లేదు. అందుకే నిన్న మాంచెస్టర్ లో జరిగిన దాయాదుల వరల్డ్ కప్ సమరంపై ప్రపంచమంతా ఆసక్తి చూపించింది. కానీ, పాకిస్థాన్ తన చెత్త రికార్డును నిలబెట్టుకోగా, చిరకాల ప్రత్యర్థిపై తన తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ మరోసారి ఘనంగా చాటుకుంది. ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో వర్షం అడ్డంకిగా నిలిచిన మ్యాచ్ లో కోహ్లీ సేన 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, మ్యాచ్ సగంలో ఉండగానే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ టీమిండియాకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ఈ విజయానికి బీసీసీఐ అనుసరిస్తున్న విధానాలే కారణం అని, ఐపీఎల్ కారణంగా భారత క్రికెటర్ల ఆటలో నాణ్యత అత్యున్నత స్థాయికి చేరిందని పేర్కొన్నాడు. ఐపీఎల్ ప్రతిభావంతులను వెలికి తీయడమే కాకుండా, ఒత్తిడిలో ఎలా ఆడాలో, ఎలా ఆడకూడదో యువ ప్లేయర్లకు నేర్పిస్తోందని కితాబిచ్చాడు. అఫ్రిదీ ఈ ట్వీట్ చేసే సమయానికి పాక్ లక్ష్యఛేదనలో సగం వికెట్లను కోల్పోయింది.
మ్యాచ్ ఫలితం తేలకముందే వచ్చిన ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ, పాక్ జట్టుపై అఫ్రిదీకి ఎంత గట్టినమ్మకమో అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ కు ముందు అఫ్రిదీ మరో ట్వీట్ లో, జీవితకాలం చెప్పుకునే అవకాశం ఇప్పుడొచ్చిందని, పాక్ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డాలని పిలుపునిచ్చాడు. యావత్ పాకిస్థాన్ మీ వెన్నంటే ఉంది, పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. కానీ అది నిష్ప్రయోజనమే అయింది.