Bihar: బీహార్లో 144 సెక్షన్... కారణం మండుతున్న ఎండలే!
- బీహార్లో పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్య
- పాఠశాలలు ఈనెల 22వరకు మూసివేత
- ప్రభుత్వ కార్యకలాపాలు నిలిపివేత
సాధారణంగా ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనకర పరిస్థితులు నెలకొంటే 144 సెక్షన్ విధిస్తుంటారు. ప్రజలు గుంపులుగా తిరగడంపై నిషేధాజ్ఞలు విధిస్తారు. అయితే బీహార్లో ఇవేవీ లేకుండానే 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. దీనికి కారణం రాష్ట్రంలో ఎండలు మండిపోతుండడమే. గత కొన్నిరోజులుగా బీహార్ లోని అత్యధిక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు, ఆపైన నమోదవుతున్నాయి.
ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. బీహార్ లో ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా 76 మంది మృత్యువాత పడ్డారు. దాంతో, ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సంచారంపై ఆంక్షలు విధించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో తిరగడంపై నిషేధాజ్ఞలు విధించారు. అంతేగాకుండా, పాఠశాలలను ఈ నెల 22 వరకు మూసివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ కార్యకలాపాలు, ఆఫీసులు, సాంస్కృతిక వ్యవహారాలు నిలిపివేయాలని స్పష్టం చేశారు.