Pakistan: మీకేం.. మీరు బాగానే ఇంటికెళ్తారు.. నేనే రాలేను!: జట్టు సభ్యులతో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ గోడు
- మిగతా మ్యాచుల్లో రాణించి తలెత్తుకోవాలి
- పరిస్థితి ఇలానే ఉంటే దేశంలో అడుగుపెట్టలేను
- సహచరులను ఉద్దేశించి సర్ఫరాజ్
ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. సొంత దేశంలో అభిమానులు ఆగ్రహంతో ఉడికిపోతున్నారు. దేశంలో అడుగు ఎలా పెడతారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ సూచనలను పెడచెవిన పెట్టడం, తప్పుడు నిర్ణయాల కారణంగా కెప్టెన్ సర్ఫరాజ్ ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
భారత్ చేతిలో పరాజయం తర్వాత సర్ఫరాజ్ జట్టు సభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జట్టులో తానొక్కడికే తిరిగి దేశానికి వచ్చే పరిస్థితులు లేవని, మిగతా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొన్నట్టు పాకిస్థాన్ పత్రిక ‘ది న్యూస్’ పేర్కొంది.
మిగతా మ్యాచుల్లోనైనా పరిస్థితి మారకుంటే తానిక సొంత దేశంలో అడగుపెట్టలేనని సర్ఫరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, అభిమానుల ఆగ్రహాన్ని ప్రతి ఒక్కరు భరించాల్సిందేనన్నాడు.
‘‘నేను తిరిగి ఇంటికెళ్తానని అనుకుంటే అది పొరపాటే. దురదృష్టవశాత్తు వచ్చే మ్యాచుల్లో మన ప్రదర్శన బాగోలేకపోతే.. నేనిక ఇంటికి తిరిగి వెళ్లలేను’’ అని సర్ఫరాజ్ అన్నట్టు పత్రిక పేర్కొంది.
ఇక అయిందేదో అయిపోయిందని, జరగాల్సిన మ్యాచ్‌ల్లోనైనా రాణించి తలెత్తుకోవాలని సహచరులకు సూచించాడు. సర్ఫరాజ్ మాట్లాడుతున్నంతసేపూ సీనియర్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు మౌనంగా ఉన్నట్టు పత్రిక తెలిపింది. కాగా, పాయింట్ల పట్టికలో పాక్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది.