Rashid Khan: ఎవరూ కోరుకోని రికార్డు సొంతం చేసుకున్న ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్
- వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా రికార్డు
- నైబ్ రికార్డును సవరించిన రషీద్ ఖాన్
- రషీద్ బౌలింగ్ లో 11 సిక్సర్లు కొట్టిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు
కొన్నాళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఎదుర్కోవడం అంటే అగ్రశ్రేణి బౌలర్లకు సైతం ఎంతో కష్టసాధ్యంగా ఉండేది. ఇప్పుడది గతం. ఇవాళ మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో రషీద్ ఖాన్ ఓ గల్లీ బౌలర్ తరహాలో తేలిపోయాడు. స్పిన్ కు ఏమాత్రం సహకరించిన ఇంగ్లాండ్ పిచ్ పై ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ రషీద్ ఖాన్ ను ఓ ఆటాడుకున్నారు. ఎంతలా అంటే, తన 10 ఓవర్ల కోటా పూర్తిచేయకముందే ఓ పరమచెత్త రికార్డును సొంతం చేసుకునేంత!
9 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 110 పరుగులు సమర్పించుకున్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇది కూడా ఓ రికార్డు. అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ గా ఈ ఆఫ్ఘన్ బౌలర్ రికార్డు పుటల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘన్ కే చెందిన నైబ్ పేరిట ఉంది. నైబ్ 101 పరుగులిస్తే, రషీద్ దాన్ని 110 పరుగులతో తిరగరాశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మొత్తం 11 సిక్సర్లు బాదారు. బెయిర్ స్టో మొదలుపెట్టిన ఆ విధ్వంసాన్ని ఇయాన్ మోర్గాన్ తారస్థాయికి తీసుకెళ్లడంతో రషీద్ ఖాన్ కు అవాంఛిత రికార్డు తప్పలేదు.