Andhra Pradesh: ఏపీ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తాం: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- జాతీయ స్థాయిలో సంకీర్ణ సర్కార్ రావాలనుకున్నాం
- కానీ, అది సాధ్యపడలేదు
- ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్
ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. జాతీయ ఛానెల్ న్యూస్ ఎక్స్ నిర్వహించిన ‘ఇండియా నెక్ట్స్’ డిబేట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారని అన్నారు. జగన్ అధికారం చేపట్టిన రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్నారని కొనియాడారు.
చంద్రబాబునాయుడు పాలనలో ఏపీలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. సీబీఐ ఏపీలో కేసులను దర్యాప్తు చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని, జగన్ అధికారంలోకి రాగానే సీబీఐ దర్యాప్తునకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుమతిచ్చారని అన్నారు.
దేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సైతం తమ సత్తాను చాటుకున్నాయని అన్నారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తామని, జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని తాము భావించాం కానీ, అది సాధ్యపడలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన డిమాండ్ అని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.