Andhra Pradesh: మరిన్ని ఇబ్బందుల్లో కోడెల శివరామ్.. ‘కె ఛానల్’ పేరిట స్టార్ ప్రసారాల పైరసీ!
- డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీ
- ఢిల్లీ హైకోర్టు విచారణ.. సమన్లు జారీ
- త్వరలో కోర్టు ధిక్కరణ కింద చర్యలు
టీడీపీ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తాజాగా ఆయన స్టార్ టీవీ ప్రసారాలను పైరసీ చేసి ‘కె ఛానల్’ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గౌతం కమ్యూనికేషన్ పేరిట ఈ ఛానల్ ను నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఈ విషయమై స్టార్ టీవీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. డీటీహెచ్ ద్వారా సాంకేతిక చోరీకి పాల్పడుతున్న శివరాం, ప్రతినెలా లక్షల రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ విషయమై గతంలో తాము పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదనీ, దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీంతో కోర్టు అడ్వొకేట్ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిషన్ రాజాగారి కోట ప్రాంతంలో కోడెల ఇంట్లో నిర్వహిస్తున్న ‘కె ఛానల్’ ఆఫీసుపై ఏప్రిల్ 18న దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సాంకేతిక చౌర్యానికి వాడుతున్న డీకోడర్, ఎన్ కోడర్ లను స్వాధీనం చేసుకుందని చెప్పారు.
ఈ వివరాలను కమిషన్ కోర్టుకు సమర్పించింది. కాగా, ఈ వ్యవహారంలో కోర్టు సమన్లను ఇచ్చేందుకు నిన్న కోడెల ఇంటికి వెళ్లగా అక్కడి సిబ్బంది నిరాకరించారని స్టార్ టీవీ ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద కోడెల శివరామ్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ న్యాయస్థానానికి నివేదిక అందజేస్తుందని పేర్కొన్నారు.