Pakistan: ఆర్థిక వ్యవస్థ నుంచి క్రికెట్ వరకు అన్నింటిలో దిగజారిపోతున్నాం: పాకిస్థాన్ చీఫ్ జస్టిస్
- నిరుత్సాహం అనే పదాన్ని తప్ప మనం ఇతర పదాన్ని వినడం లేదు
- రాజకీయ నాయకులు వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు
- టీవీ ఆన్ చేస్తే.. పాక్ ఓటమిని చూస్తాం
దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు వింటేనే అర్థమైపోతుంది. గత కొంత కాలంగా 'నిరుత్సాహం' అనే పదాన్ని తప్ప పాకిస్థానీలు మరే పదాన్ని వినడం లేదని పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాల నుంచి చివరకు క్రికెట్ వరకు అన్నింటా దిగజారిపోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ మోడల్ కోర్టులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని... ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు.
పార్లమెంటులో అధికారపక్షం కానీ, విపక్షం కానీ వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదని... ఇది నిరాశను కలిగించే అంశమని ఆసిఫ్ చెప్పారు. టీవీలో ఛానల్ మార్చి క్రికెట్ చూస్తే... అక్కడ కూడా అంతకంటే ఎక్కువ నిరాశే కలుగుతోందని... మన దేశ ఓటమిని చూస్తామని అన్నారు.
ఇంత నిరాశాజనకమైన పరిస్థితుల్లో కూడా ఒక అంశం సంతోషాన్ని కలిగిస్తోందని... మన న్యాయ వ్యవస్థ చాలా చక్కగా పని చేస్తోందని చీఫ్ జస్టిస్ చెప్పారు. మోడల్ కోర్టుల ద్వారా 48 గంటల్లో 5,800 కేసులను పరిష్కరించామని తెలిపారు.