Chandrababu: చంద్రబాబే పక్కా ప్లాన్ తో పంపిస్తున్నారు... బీజేపీలోకి వచ్చే టీడీపీ నేతల పట్ల మోదీ అప్రమత్తంగా ఉండాలి: సి.రామచంద్రయ్య
- చంద్రబాబు వికృత రాజకీయ చర్యల్లో ఇదొకటి
- అప్పట్లో నామాను టీఆర్ఎస్ లోకి పంపారు
- ఇప్పుడు మరో నలుగుర్ని పంపిస్తున్నారు
తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా 'బీజేపీలో చేరనున్న టీడీపీ నేతలు!' అంటూ వార్తలు దర్శనమిస్తున్నాయి. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు తదితరులు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారంటూ మీడియా వర్గాలు కోడైకూస్తున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ యాత్రలో ఉన్న తరుణంలో ఇలాంటి కథనాలు తెరపైకి రావడం గమనార్హం. అయితే, ఈ కథనాలపై వైసీపీ విభిన్నంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎంపీలు బీజేపీ వైపు చూడడం అనేది చంద్రబాబు వికృత రాజకీయాల్లో భాగమేనని ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో తాను ఇరుక్కున్నప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికి నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ లోకి పంపించారని, ఆ తర్వాత మండవ వెంకటేశ్వరరావును కూడా ప్రోత్సహించారని తెలిపారు. ఇప్పుడు అదే తరహాలో తన పార్టీ నుంచి నలుగురిని బీజేపీలోకి పంపడం ద్వారా తన అవినీతి, అక్రమాలను వెలుగులోకి రాకుండా జాగ్రత్తపడుతున్నారని సి.రామచంద్రయ్య ఆరోపించారు.
తనపైనా, తనవాళ్లపైనా కేసులు లేకుండా చేసుకునేందుకే చంద్రబాబు ఈ విధమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు. టీడీపీ నుంచి వచ్చే ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలంటే అవినీతిపరులకు స్థానం కల్పించరాదని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నలుగురు ఎంపీల్లో మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా నానామాటలు అన్నవాళ్లు ఉన్నారని, అలాంటి వ్యక్తులు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటూ ఏం జరుగుతుందో ఆలోచించాలని రామచంద్రయ్య తెలిపారు. పౌరుషం లేకుండా వాళ్లను బీజేపీలోకి తీసుకుంటే దానికి ఎవరూ ఏంచేయలేరని వ్యాఖ్యానించారు.