Uttar Pradesh: సీఎం యోగి, మోహన్ భగవత్ పై అనుచిత వ్యాఖ్యలు .. పంజాబీ గాయకురాలిపై దేశద్రోహం కేసు!
- ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించిన హర్ద్ కౌర్
- పోలీసులకు లాయర్ శశాంక్ ఫిర్యాదు
- ఐపీసీ 153ఏ, 500,505, ఐటీ చట్టం 66 సెక్షన్ కింద కేసు
పంజాబీ గాయకురాలు, ర్యాపర్ హర్ద్ కౌర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు అయింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ పై హర్ద్ కౌర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ నెల 17న తన ఫేస్ బుక్ లో కౌర్, మోహన్ భగవత్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.
దేశచరిత్రలో మహాత్మాగాంధీ, మహవీర్ లు బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని, భగవత్ జాతీయవాది కాదని విమర్శించారు. మరుసటి రోజే ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వారణాసికి చెందిన లాయర్ శశాంక్ శేఖర్ ఫిర్యాదుతో హర్ద్ కౌర్ పై దేశద్రోహ చట్టం(సెక్షన్ 124ఏ) తో పాటు ఐపీసీ సెక్షన్ 153ఏ, 500,505, ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం కేసు నమోదు చేశారు. ఓకే జాను, పటియాలా హౌస్, అగ్లీ ఔర్ పగ్లీ సినిమాల్లో పాడిన పాటలతో హర్ద్ కౌర్ మంచి పేరు తెచ్చుకున్నారు.