Andhra Pradesh: మోదీ ఓడిపోతాడని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు.. అందుకే బయటకు వెళ్లిపోయారు!: ఐవైఆర్ కృష్ణారావు
- హోదా వద్దు ప్యాకేజీ కావాలని బాబు అన్నారు
- నియోజకవర్గాలను పెంచాలని డిమాండ్ చేశారు
- ట్విట్టర్ లో మండిపడ్డ ఏపీ మాజీ సీఎస్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలోనే తాము బీజేపీతో విభేదించామని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది ఆంధ్రుల కోసం తాము కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. తాజాగా బీజేపీ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ప్రత్యేకహోదాకు బదులుగా చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించారని ఐవైఆర్ గుర్తుచేశారు.
అలాగే పార్టీ ఫిరాయింపుదారుల కోసం నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని విమర్శించారు. అయితే చంద్రబాబు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే గెలవదని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారనీ, ఆ అంచనాతోనే బీజేపీ నుంచి దూరం జరిగారని పేర్కొన్నారు. గెలిచే పక్షం తరఫునే ఉండాలని చంద్రబాబు అనుకున్నారనీ, అయితే అది జరగలేదని అన్నారు. చంద్రబాబు చెప్పిన విషయాల్లో నిజం ఒక్కటీ లేదని విమర్శించారు.