Andhra Pradesh: 2024 ఎన్నికలపై చంద్రబాబు కన్నేశారు.. అందుకే నలుగురిని బీజేపీలోకి పంపారు!: ఏపీ మంత్రి శంకర్ నారాయణ
- సుజన, రమేశ్ లు బాబు బినామీలు
- కుంభకోణాల్లో ఉన్నవారంతా బీజేపీలో చేరుతున్నారు
- తిరుమలలో మీడియాతో ఏపీ బీసీ శాఖ మంత్రి
బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్, సీఎం రమేశ్ లపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. సుజనా, సీఎం రమేశ్ లు చంద్రబాబుకు బినామీలని ఆరోపించారు. చంద్రబాబు అనుమతితోనే ఈ నలుగురు బీజేపీలో చేరారని విమర్శించారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
2024 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నారనీ, అందులో ఇది భాగమని దుయ్యబట్టారు. కుంభకోణాల్లో ఉన్నవారంతా బీజేపీలో చేరుతున్నారని మంత్రి శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. ఏపీలో జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది జగన్ నినాదమనీ, దాన్ని సాధించితీరుతామని స్పష్టం చేశారు.