Asaduddin Owaisi: ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు
- ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
- ఇది రాజ్యాంగ ఉల్లంఘనే
- ఈ బిల్లు ద్వారా మహిళలకు మరింత అన్యాయం!
మూడుసార్లు తలాక్, తలాక్, తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశ పెట్టడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని 14, 15వ అధికరణలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇప్పటికే ముస్లిం మహిళా వివాహ చట్టంతో పాటు సీఆర్పీసీ సెక్షన్ 125, గృహహింస చట్టం 2005 ఉన్నాయని, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే మహిళలకు అంతకంటే అన్యాయం మరొకటి ఉండదని ఒవైసీ వివరించారు. "ఇదే తప్పు ముస్లిమేతరుడు చేస్తే ఏడాది జైలా? ముస్లిం వ్యక్తి చేస్తే మూడేళ్ల జైలా? ఇదేం న్యాయమో ప్రధాని మోదీయే చెప్పాలి" అంటూ నిలదీశారు.