visakhapatnam: విశాఖలో భూగర్భ మెట్రో రైలు ప్రతిపాదన.. తాజా పరిశీలన
- పునరాలోచన చేస్తున్న అధికారులు
- నగర అందాలు దెబ్బతినకుండా చూడాలన్న ఆలోచన
- అలా అయితే రూ.1500 కోట్లు అదనంగా ఖర్చు
నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖ నగరంలో నిర్మించతలపెట్టిన మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు అధికారులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ తరహాలో పిల్లర్లు నిర్మించి రహదారులకు కాస్త ఎత్తులో మెట్రో రైలు మార్గం నిర్మించాలని భావించారు. తాజాగా కోల్‌కతా టైప్‌లో భూగర్భంలో నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నారు. పర్యాటక స్వర్గథామంగా ఉన్న విశాఖ అందాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇదే మంచి ఆలోచన అవుతుందని, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.
నగరంలో ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ మొత్తం 42.55 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు మార్గం నిర్మించాలన్నది ఇప్పటి వరకు ఆలోచన. ఇందులో ప్రధానమైనది 30.38 కిలోమీటర్ల పొడవున్న గాజువాక-కొమ్మాది మార్గం. దీనికి అనుసంధానిస్తూ గురుద్వారా-పాతపోస్టాఫీసు మధ్య (5.25 కిలోమీటర్లు), తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మధ్య (6.91 కిలోమీటర్లు) మరో రెండు మార్గాలు నిర్మించాలని భావించారు.
ఇందుకు దాదాపు 8,300 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో 4,200 కోట్లు దక్షిణ కొరియా నుంచి రుణంగా తీసుకుంటున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టు చేపట్టిన సంస్థకు నగర పరిధిలో 250 ఎకరాల భూమి కేటాయించి దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు నాలుగైదు సంస్థలు ఆసక్తి చూపించినప్పటికీ ఆ ప్రయత్నం ముందుకు వెళ్లలేదు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టు పునఃసమీక్షకు తెరతీయడంతో తాజా ఆలోచనలు తెరపైకి వస్తున్నట్లు సమాచారం.
పర్యాటక ప్రాంతమైన విశాఖలో పిల్లర్లపై మెట్రో రైలు నడిపితే నగర అందాలు దెబ్బతింటాయని, కాస్త ఖర్చు అధికమైనా భూగర్భమే మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. తాజా నిర్ణయమే వాస్తవ రూపం దాల్చితే మరో రూ.1500 కోట్లు ప్రాజెక్టు కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.