congress: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్...వీరు కూడా ఆ పార్టీలోకేనా?
- పలువురు కాంగ్రెస్ మాజీల చూపు
- అటు నుంచి ప్రారంభమైన మంతనాలు
- ఎటూ తేల్చుకోలేకపోతున్న నేతలు
అధికారం దూరం కావడం...ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రముఖుల చూపు బీజేపీవైపు ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న కమనాథులు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపడం, ఇప్పటికే పలువురు కాంగ్రెస్ మాజీ ఎంపీలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని చెబుతుంటే కొందరు నేతలు మాత్రం అటువంటిదేమీ లేదంటున్నారు. మొత్తమ్మీద రాజకీయ పునరేకీకరణపై ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపారెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఆయన బీజేపీలో చేరుతున్నారన్న ఊహాగానాలు చెలరేగాయి. ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం షోకాజ్ జారీకి నిర్ణయించింది. అలాగే సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు బలరాంనాయక్, సర్వేసత్యనారాయణతో కూడా బీజేపీ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. ఇదే విషయాన్ని బలరాం నాయక్ వద్ద మీడియా ప్రస్తావిస్తే బీజేపీ తమతో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమేనని, కానీ వెళ్లాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎటువైపు వెళ్తుందో చూడాలి.