Chandrababu: ఆ ఒక్క విషయంలో చంద్రబాబుతో విభేదించాను తప్ప లోకేశ్ విషయంలో జోక్యం చేసుకోలేదు: సుజనా చౌదరి
- ఎన్డీయే నుంచి బయటికిరావడం తప్పని చెప్పాను
- లోకేశ్ విషయంలో జరుగుతున్న ప్రచారం తప్పు
- 2017 తర్వాత పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు
టీడీపీ యువనేత నారా లోకేశ్ విషయంలో తాను చంద్రబాబుతో విభేదించినట్టు వస్తున్న ఆరోపణలను బీజేపీ నేత సుజనా చౌదరి కొట్టిపారేశారు. నారా లోకేశ్ కు పార్టీలో ఉన్నత పదవులు ఇవ్వడం తొందరపాటు అవుతుందని, సీనియర్లు ఉన్నప్పుడు లోకేశ్ ను కొంతకాలం పాటు ఆపాలని తాను చంద్రబాబుతో అన్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని సుజనా స్పష్టం చేశారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సుజనా ఈ మేరకు తెలిపారు.
తాను చంద్రబాబుతో విభేదించింది ఒక్క విషయంలో మాత్రమేనని, ఎన్డీయే నుంచి బయటికి రావడం తప్పని వాదించానని, అంతే తప్ప లోకేశ్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, లోకేశ్ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని వివరించారు. అయితే, జరుగుతున్న విషయాలను మాత్రం ఎప్పటికప్పుడు అధినేతకు నివేదించానని తెలిపారు. వెంటనే స్పందించరు, ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు ఇత్యాది విషయాలను మాత్రం తాను ఫిర్యాదు చేసినట్టు సుజనా వెల్లడించారు. పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోవడంతో 2017 నుంచి అది కూడా మానుకున్నట్టు చెప్పారు.