Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!
- జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు
- అధికారులు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలి
- కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఏపీ సీఎస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అమరావతిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం అయ్యారు. నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక పాలన అజెండాగా ఈ సమావేశం ప్రారంభమయింది. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగనున్న ఈ సదస్సులో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ పథకాన్ని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతీరోజూ గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని కోరారు. ప్రతివారం తాను కూడా ఈ విషయమై కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.
అధికారులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గంటలు గంటలు సమీక్షలు పెట్టకుండా సృజనాత్మకంగా ఆలోచించడానికి అధికారులకు మరింత సమయం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే అవసరమైనంత మేరకు మాత్రమే షెడ్యూల్ ను ముఖ్యమంత్రి నిర్దేశించారని చెప్పారు.