Andhra Pradesh: ఏదో చంద్రబాబు ఆస్తిని కూల్చేస్తున్నట్టు భయపడిపోతున్నారు: వైసీపీ ఎంపీ నందిగామ సురేశ్
- సీఎం జగన్ కు రాజీపడే ఉద్దేశమే లేదు
- అక్రమనిర్మాణం ప్రజావేదికను కూల్చి తీరతారు
- ఇది కక్షపూరిత చర్యగా టీడీపీ వాళ్లకే కనబడుతోంది
అక్రమ నిర్మాణం ప్రజావేదికను కూల్చివేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రకటనపై టీడీపీ నేతలు, నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వారి విమర్శలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీ నందిగామ సురేశ్ స్పందిస్తూ, ప్రజావేదికను కూల్చివేస్తామన్నది కక్షపూరిత చర్యగానో, అక్రమంగానో టీడీపీ నాయకులకు మాత్రమే కనిపిస్తోందని విమర్శించారు. అక్రమకట్టడం కూల్చేస్తామంటే అదేదో, చంద్రబాబు ఆస్తిని కూల్చేస్తున్నట్టు భయపడిపోతున్నారని అన్నారు.
తాము చేసిన తప్పులు ఇంకెన్ని బయటకొస్తాయోనన్న టెన్షన్ టీడీపీ వాళ్ల ముఖాల్లో కనబడుతోందని ఆయన అన్నారు. సీఎం జగన్ కు రాజీపడే ఉద్దేశమే లేదని అక్రమనిర్మాణం ప్రజావేదికను కూల్చి తీరతారని స్పష్టం చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ ఆరునెలల్లోగా కూల్చివేస్తామని గతంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమా చెప్పారని గుర్తుచేశారు. ప్రజావేదిక, కరకట్టపై ఉన్న అక్రమనిర్మాణాలను కూల్చి వేయాలన్న జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఘంటా పథంగా చెప్పారు.