Nara Lokesh: ఒంగోలు అత్యాచార ఘటనలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు: నారా లోకేశ్
- మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండించిన లోకేశ్
- వైసీపీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న టీడీపీ యువనేత
- ట్విట్టర్ లో స్పందన
కొన్ని రోజుల క్రితం ఒంగోలు పట్టణంలో ఓ మైనర్ బాలికను కొంతమంది కిరాతకులు బంధించి వారంరోజుల పాటు అత్యాచారం చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణంలో ప్రధానంగా ఓ దివ్యాంగుడు ముఖ్యభూమిక పోషించడం అందరినీ నివ్వెరపరిచింది. తాజాగా ఈ ఘటనపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ రాజకీయకోణంలో వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో కూడా సంచలనం కలిగిస్తున్న ఈ నీచమైన వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలే నిందితులు కావడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఓ మైనర్ బాలికపై జరిగిన ఈ అమానుషాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వైఎస్ జగన్ గారూ, మీ వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంతమాత్రం సురక్షితంగా లేదన్న విషయాన్ని ఒంగోలు ఘటన నిరూపిస్తోంది అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు గతంలో జగన్ తో తీయించుకున్న సెల్ఫీలను కూడా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ దివ్యాంగుడికి రెండు చేతులు లేకపోవడంతో జగనే స్వయంగా సెల్ఫీ క్లిక్ మనిపించారు.