England: ఇంగ్లండ్‌పై గెలిచి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా
- బెహ్రెండార్ఫ్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
- సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్న ఆతిథ్య జట్టు
- భారత్, కివీస్‌లపై నెగ్గితేనే సెమీస్‌కు
ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో తొలి సెమీఫైనలిస్ట్ ఖరారైంది. మంగళవారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన ఆస్ట్రేలియా దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఇక టాపార్డర్ ఘోర వైపల్యంతో వరుస పరాజయాల పాలవుతున్న ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆసీస్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తానెంత తప్పు చేసిందీ తర్వాత కానీ తెలుసుకోలేకపోయాడు. భీకర ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (100) రెండో సెంచరీ నమోదు చేశాడు. ఒకానొక దశలో జట్టు స్కోరు 350 దాటుతుందని భావించినా చివర్లో ఇంగ్లిష్ బౌలర్లు కట్టడి చేయడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వార్నర్ 53, ఉస్మాన్ ఖావాజా 23, స్టీవ్ స్మిత్ 38, అలెక్స్ కేరీ 38 పరుగులు చేశారు.
286 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి ఓవర్ రెండో బంతికే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ డకౌట్ అయ్యాడు. అది మొదలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ కష్టాల్లో కూరుకుపోయింది. బెహ్రెండార్ఫ్, మిచెల్ స్టార్క్‌లు ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. 53 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో ఉన్న జట్టుకు బెన్ స్టోక్స్ జవసత్వాలు నింపే ప్రయత్నం చేశాడు. బట్లర్ (25) తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరూ కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే, స్టోక్స్ (89) అవుటయ్యాక ఇంగ్లండ్ ఆశలు నీరు కారాయి.
వోక్స్ (26), రషీద్ (25)లు ఆసీస్ బౌలర్లను కాసేపు ఎదురొడ్డినా క్రీజులో నిలవలేకపోయారు. ఫలితంగా విజయానికి 64 పరుగుల ముందే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఘన విజయం సాధించిన ఆసీస్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆసీస్ బౌలర్లలో బెహ్రెండార్ఫ్ 5 వికెట్లు పడగొట్టగా, స్టార్క్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సెంచరీ బాదిన అరోన్ ఫించ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ తన తర్వాతి రెండు మ్యాచ్‌లను భారత్, న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని ఈ రెండు జట్లపైనా నెగ్గితే తప్ప ఇంగ్లండ్ సెమీస్ చేరడం కష్టం.