Andhra Pradesh: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియపై.. క్యాంపు ఆఫీసులో సీఎం జగన్ సమీక్ష!
- తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ
- హాజరైన మంత్రులు బుగ్గన, పేర్ని నాని
- ఎలక్ట్రికల్ బస్సులను తీసుకోవడాన్ని పరిశీలించనున్న జగన్
తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది. తాజాగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ భేటీకి మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఆర్టీసీ విలీన కమిటీకి జగన్ ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం సచివాలయంలో అధ్యయన కమిటీ సభ్యులు విడివిడిగా భేటీ కానున్నారు. అలాగే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టే విషయాన్ని కూడా సీఎం జగన్ పరిశీలిస్తారని తెలుస్తోంది. మూడు నెలల తర్వాత ఆర్టీసీ విలీన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.