Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళుతున్న రోడ్డుపై వివాదం.. రైతుల ఫిర్యాదు!

  • అధికారులను ఆశ్రయించిన రైతులు ప్రకాశ్, సాంబశివరావు
  • ఐదేళ్ల కాలానికే తాము భూమిని ఇచ్చామంటున్న రైతులు
  • ఒప్పందం ముగిసినందున భూమిని వెనక్కి ఇవ్వాలని డిమాండ్

ఉండవల్లిలో ‘ప్రజావేదిక’ కూల్చివేత వ్యవహారం కాక రేపుతోంది. ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేతను ప్రభుత్వం ప్రారంభించగా, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇంటికి వెళుతున్న రోడ్డుపై గొడవ మొదలయింది. సీఆర్డీఏ అధికారులు తమ పొలం నుంచి ప్రజావేదిక, చంద్రబాబు నివాసం వరకూ రోడ్డు వేశారని రైతులు ప్రకాశ్, సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం తమ భూములను తీసుకున్న అధికారులు ఇప్పటివరకూ నష్టపరిహారం చెల్లించలేదని వాపోయారు.

చంద్రబాబు పదవీకాలం అయిపోయాక ఈ రోడ్డు కోసం ఇచ్చిన భూమిని తాము తిరిగి పొలంలో కలుపుకునేలా ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. దీనికి ఆర్డీవో భాస్కరనాయుడు, ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి ఒప్పందంపై సంతకం పెట్టారనీ, దాని కాపీలను జిల్లా కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్, ఉండవల్లి సీఆర్డీఏ కలెక్టర్, తనకు తలో కాపీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాజాగా ప్రభుత్వం మారింది కనుక.. ఇప్పుడు తమ స్థలాన్ని తమకు వెనక్కు ఇచ్చేయాలని కోరారు.

తమ భూమిని పూలింగ్ కు ఇవ్వాలని తొలుత కోరారనీ,  ఇందుకు తాము అంగీకరించకుండా రోడ్డుకు స్థలం ఇచ్చామని చెప్పారు. తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారనీ, ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ గొడవ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే రోడ్డును కూడా తొలగించే అవకాశముందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజావేదిక, చంద్రబాబు నివాసానికి వెళుతున్నది ఒకే రోడ్డు కాబట్టి, అక్రమ కట్టడం సాకుగా రోడ్డును తవ్వేసే అవకాశముందని భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News