Andhra Pradesh: ఆ చట్టాన్ని ఓసారి చదవండి యనమల గారూ.. ఎవరు తుగ్లకో మీకే తెలుస్తుంది!: విజయసాయిరెడ్డి కౌంటర్
- నదీతీరాన్ని పూడ్చి నిర్మాణాలు చేపట్టారు
- ఇప్పుడు కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజావేదికను కూల్చడం తుగ్లక్ చర్య అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. కొత్త భవనాలను నిర్మించకుండా ఇలా పాతవాటిని కూల్చడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. సీఎం జగన్ అభివృద్ధిని పక్కన పెట్టి విధ్వంసం చేస్తున్నారనీ, ఇప్పటివరకూ 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కూడా ఆయన కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో యనమల తుగ్లక్ వ్యాఖ్యలకు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నదీ పరిరక్షణ చట్టాన్ని యనమల ఓసారి చదవాలనీ, అప్పుడు ఎవరు తుగ్లకో తెలుస్తుందని విజయసాయిరెడ్డి సూచించారు. ‘రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సిందిపోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు’ అని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.