Telangana: విశాఖ శారదా పీఠాధిపతులకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం

  • స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలకు పుష్పాభిషేకం
  • హాజరైన స్పీకర్ పోచారం, మంత్రులు
  • హైదరాబాద్ లో శారదా పీఠానికి కేటాయించిన భూమి పత్రాలను అందజేసిన కేసీఆర్

హైదరాబాద్ లోని జలవిహార్ లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములకు సీఎం కేసీఆర్ పుష్పాభిషేకం మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములకు కేసీఆర్ నూతన వస్త్రాలను సమర్పించి, పుష్పమాలతో సత్కరించారు. తెలంగాణ హరితహారానికి ప్రతీకగా తులసిమాలలను కేసీఆర్ సమర్పించారు. హైదరాబాద్ లో శారదా పీఠానికి కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వరూపానందేంద్రకు కేసీఆర్ అందజేశారు. అంతకుముందు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్రలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్, స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఆదిశంకరాచార్యుల చిత్రపటానికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర అనుగ్రహ భాషణం చేస్తూ, స్వరూపానందేంద్ర స్వామి ఆదేశాల మేరకు దేశం నలుమూలలా పర్యటించి శంకర అద్వైతాన్ని ప్రచారం చేస్తానని అన్నారు. ధర్మప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభిస్తానని చెప్పారు.

స్వరూపానందేంద్ర అనుగ్రహ భాషణం చేస్తూ, సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్ లో స్థలం కేటాయించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు.
 

  • Loading...

More Telugu News