MBBS: రైల్లో దొరికిన ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చలామణి.. వైద్యం వికటించడంతో దొరికిపోయిన వైనం!
- 9 ఏళ్లలో 90 వేలమందికి వైద్యం
- నెలకు లక్ష వేతనంతో మరో ఆసుపత్రిలో జాబ్
- తన వైద్యంతో పేషెంట్లకు చుక్కలు చూపించిన వైనం
రాజస్థాన్ లో ఓ వ్యక్తి తనది కాని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ తో వైద్యుడిగా చలామణీ అవడమే కాకుండా లక్షలు సంపాదించిన వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం 9 ఏళ్ల వ్యవధిలో సుమారుగా 90 వేలమందికి వైద్యసేవలు అందించడం ద్వారా, నికార్సయిన డాక్టర్లకు కూడా సాధ్యంకాని రీతిలో విపరీతంగా వైద్యం చేశాడు. అతడి పేరు మాన్ సింగ్ బాఘేల్. మాన్ సింగ్ డాక్టర్ అవతారం ఎత్తడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకరోజు మాన్ సింగ్ రైల్లో ప్రయాణిస్తుండగా, వేరెవరిదో ఎంబీబీఎస్ సర్టిఫికెట్ దొరికింది. దాన్ని భద్రంగా ఇంటికి తీసుకువచ్చిన మాన్ సింగ్ తన తెలివితేటలు ఉపయోగించి దానిపై తన ఫొటోను ముద్రించాడు. ఇంకేముందీ... ఎంతోకష్టపడి చదివితే తప్ప రాని ఎంబీబీఎస్ సర్టిఫికెట్ మాన్ సింగ్ కు సునాయాసంగా లభించినట్టయింది. అప్పటినుంచి సమాజంలో డాక్టర్ గా చలామణీ అవుతూ డబ్బు సంపాదనలో ఆరితేరిపోయాడు.
అయితే, మాన్ సింగ్ బండారం ఇటీవలే బయటపడింది. ఓ ప్రముఖ ఆసుపత్రి డాక్టర్లు కావాలంటూ ప్రకటన ఇవ్వగా, మాన్ సింగ్ కూడా దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించాడు. నెలకు లక్ష రూపాయల వేతనంతో ఉద్యోగం అయితే దక్కించుకున్నాడు కానీ, వైద్యం చేస్తే ప్రతికూల ఫలితాలు రావడం మొదలయ్యాయి.
డాక్టర్ మాన్ సింగ్ అంటేనే చాలు పేషెంట్లు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికితోడు ఆసుపత్రి యాజమాన్యానికి అతడిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దాంతో, ఆసుపత్రి మేనేజ్ మెంట్ మరింత లోతుగా మాన్ సింగ్ వ్యవహారాన్ని పరిశీలించడంతో గుట్టురట్టయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.