Pakistan: న్యూజిలాండ్‌కు తొలి ఓటమి.. గెలిచి సెమీస్ ఆశలు నిలుపుకున్న పాక్

  • కివీస్ జైత్ర యాత్రకు పాక్ అడ్డుకట్ట
  • బాబర్ ఆజం అద్భుత సెంచరీ
  • 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన షహీన్

ఈ ప్రపంచకప్‌లో ఓటమన్నదే లేకుండా అప్రతిహతంగా ముందుకు సాగుతున్న న్యూజిలాండ్‌కు పాకిస్థాన్ కళ్లెం వేసింది. బుధవారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాబర్ ఆజం అజేయ సెంచరీతో మెరవడంతో 238 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన కివీస్‌కు ఇది తొలి ఓటమి.

ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్.. భారత్‌తో ఓటమి తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. కివీస్‌తో మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో రాణించిన సర్ఫరాజ్ సేన.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆడిన ప్రతీ మ్యాచ్‌ను గెలవక తప్పని పరిస్థితుల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. కివీస్ నిర్దేశించిన 238 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.  బాబర్ ఆజం (101) అజేయ సెంచరీకి తోడు హరీస్ సోహైల్ (68) మరోమారు సత్తా చాటడంతో 49.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెంచరీ వీరుడు బాబర్ ఆజంకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ షహీన్ అఫ్రిది దెబ్బకు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు మాత్రమే చేసింది. పది ఓవర్లు వేసిన షహీన్ 28 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఆటగాళ్లలో జేమ్స్ నీషమ్ (97 నాటౌట్), గ్రాండ్‌హోమ్‌ (64) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 41 పరుగులు చేశాడు. కోలిన్ మన్రో 12 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. దీంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేసింది.  

  • Loading...

More Telugu News