Chandrababu: చంద్రబాబుకు భద్రతను మరింత తగ్గించిన ఏపీ ప్రభుత్వం
- గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాబుకు పూర్తి భద్రత
- ఒక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీతో పాటు భారీ భద్రత
- ఇప్పుడు 2ప్లస్2 కానిస్టేబుళ్లతో సెక్యూరిటీ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించడంతో పాటు ఆయన వాహనశ్రేణిలో ఉన్న ఎస్కార్ట్, పైలట్ క్లియరెన్స్ వాహనాలను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భద్రతను మరింత తగ్గించారు.
ఇద్దరు ప్రధాన భద్రతాధికారులతో పాటు వారికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తొలగించారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్ఐ చంద్రబాబుకు భద్రతను కల్పిస్తూ వచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ తొలగించింది. ఇద్దరేసి కానిస్టేబుళ్ల చొప్పున 2ప్లస్2 భద్రతను కేటాయించింది.
2003లో మావోయిస్టుల దాడి తర్వాత చంద్రబాబుకు కేంద్రం పూర్తి స్థాయిలో భద్రతను కల్పించింది. జడ్ ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎన్ఎస్జీ భద్రతను కల్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను కుదించడం పట్ల టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.