USA: కన్న బిడ్డలు ఇద్దర్ని హత్యచేసిన తల్లికి 120 ఏళ్ల జైలుశిక్ష!
- ఒక్కో బిడ్డ హత్యకు 60 ఏళ్ల జైలు శిక్ష
- పెరోల్‌కు కూడా అవకాశం లేని విధంగా తీర్పు
- 2015లో దారుణానికి ఒడిగట్టిన అమెరికా మహిళ
తనను దేవుడు ఆదేశించాడంటూ మూఢనమ్మకంతో కన్నబిడ్డలు ఇద్దరిని దారుణంగా హత్యచేసి వారు మళ్లీ బతుకుతారన్న నమ్మకంతో మూడు రోజులపాటు మృతదేహాల పక్కనే గడిపిన ఓ తల్లికి అమెరికా కోర్టు 120 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిన్న తీర్పు వెలువరించింది. ఆమె జైలు జీవితంలో పెరోల్‌కు కూడా అర్హత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ప్రాసిక్యూషన్ కథనం మేరకు....అమెరికాలోని ఈస్ట్ హెవెన్ ప్రాంతానికి చెందిన లి రోయామూరేకు ఏడేళ్ల కొడుకు డారన్, ఆరేళ్ల కూతురు అలీషా ఉన్నారు. 2015 సంవత్సరంలో ఓ రోజున లి రోయా మూరే వారిద్దరినీ హత్య చేసింది. ఆ తర్వాత మూడు రోజులపాటు మృతదేహాల పక్కనే గడిపింది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె ఇంటిని సోదాచేసి దారుణాన్ని గుర్తించారు. మూరేను అరెస్టు చేసి మృతదేహాలను అంత్యక్రియలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు నిర్వహించి కేసును న్యాయస్థానానికి అప్పగించారు.
కేసు విచారణ సందర్భంగా మూరే తరపు న్యాయవాది నిందితురాలి మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఇంతటి దారుణానికి పాల్పడిందని వాదించారు. దీనికి కోర్టు అంగీకరించలేదు. ‘ఆమె చేసింది చాలా ఘోరమైన నేరం. ఇందుకు ఆమె శిక్ష అనుభవించాల్సిందే. ఇద్దరిని హత్య చేసినందుకు ఒక్కో బిడ్డ హత్యకు 60 ఏళ్ల చొప్పున 120 ఏళ్ల శిక్ష విధిస్తున్నాను. పెరోల్‌కు కూడా అవకాశం లేదు’ అంటూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.