Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు లక్ష్యం ఇదే: అమిత్ షా
- ఏ ఒక్కరినో సంతృప్తి పరిచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు
- సరిహద్దుల్లోని ప్రజల ప్రాణాలను కాపాడటం మాకు ముఖ్యం
- రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించాలి
జమ్ముకశ్మీర్ లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న ప్రజలకోసం ఉద్దేశించిన... జమ్ముకశ్మీర్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును కాసేపటి క్రితం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే... సరిహద్దుల్లో ఉన్న ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఏ ఒక్కరినో సంతృప్తి పరిచేందుకు తాము ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని... అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నివసిస్తున్న ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు ప్రవేశపెట్టామని చెప్పారు. జమ్ముకశ్మీర్లోని పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో బంకర్లను నిర్మించాలని రాజ్ నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించామని... వాటి నిర్మాణాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని అన్నారు. జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.