Andhra Pradesh: ఒకవేళ సీఎం జగన్ నన్ను డిస్మిస్ చేస్తే ఏం జరుగుతుందంటే.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు!
- గుడివాడ ప్రజలకు మరింత చేరువవుతా
- ఈసారి ఐదోసారి గెలిస్తే గండం దాటినట్లే
- వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి
గతంలో కంటే గుడివాడ ప్రజలకు మరింత చేరువై సేవలు అందిస్తానని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఎంత ఆలస్యమయినా పనులన్నీ చూసుకుని రాత్రికి తాను గుడివాడ వచ్చేస్తున్నానని చెప్పారు. తిరిగి తెల్లవారి ఉదయం పదికో, 11 గంటలకో విజయవాడ వెళుతున్నానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఐదోసారి తాను గెలిస్తే మంత్రులు గెలవరన్న సుడిగుండం నుంచి బయట పడినట్లేనని వ్యాఖ్యానించారు. అలా జరిగితే తనకు ఎదురుండదని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడలో జరిగిన ఓ కార్యక్రమంలో కొడాలి నాని ఈ మేరకు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను డిస్మిస్ చేస్తే ఏం జరుగుతుందో కొడాలి నాని చెప్పుకొచ్చారు. ‘ఒకవేళ సీఎం జగన్ మోహన్ రెడ్డి నన్ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తే నాకు ఉన్న సెక్యూరిటీ, పోలీసులు టపామని వెళ్లిపోతారు. వాళ్లందరినీ చుట్టూ పెట్టుకుని ప్రజలకు దూరమవడం వల్లే మంత్రులు ఓడిపోయారు. కానీ నేను మాత్రం గుడివాడ ప్రజలకు మరింతగా దగ్గరై సేవలు అందిస్తా’ అని తెలిపారు. వైసీపీ నేతలంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజా సమస్యలను అధికారులు, తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారంలో ఉన్నామని విర్రవీగరాదని హెచ్చరించారు.