Botsa Satyanarayana: యనమల చెప్పేదేమైనా భగవద్గీతా?: బొత్స
- ప్రభుత్వానికి ఎవరిపైనా ద్వేషంలేదు
- అక్రమకట్టడాలు కట్టిన ప్రతి ఒక్కరికీ నోటీసులు పంపాం
- ఆఖరికి అసెంబ్లీ కూడా అధికరేట్లకు ఇచ్చి కట్టారు
కట్టడాల కూల్చివేత వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం మరింత తీవ్రమైంది. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కట్టడాల కూల్చివేత విషయంలో యనమల చెప్పేదేమైనా భగవద్గీతా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబుది అక్రమకట్టడం కాదని నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా ద్వేషంలేదని, అక్రమ నిర్మాణాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆఖరికి అసెంబ్లీని సైతం అధికరేట్లకు ఇచ్చి నిర్మించారని, ఇది దోపిడీ కాక మరేంటి? అని ప్రశ్నించారు.
బొత్స గత ప్రభుత్వ పాలనపైనా విమర్శలు గుప్పించారు. లోకేశ్, చంద్రబాబుల కనుసన్నల్లోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు. వైఎస్ హయాంలో ఒక్క పైసా కూడా విద్యుత్ రేట్లు పెంచలేదని, ఈ ఐదేళ్లకాలంలో ఎంత విద్యుదుత్పత్తి పెంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, లోకేశ్ ట్విట్టర్ రాతల్లో పెద్దగా పసలేదని బొత్స ఎద్దేవా చేశారు.